పాపం..మర్రి రాజశేఖర్

మర్రి రాజశేఖర్ వైసీపీలోని సీనియర్ నేతల్లో ఒకరు. అయితే దురదృష్టం వెంటాడుతున్న నేతల్లో ముందు వరసలో ఉంటారు. ఇంతకీ ఆయన్ను వెంటాడుతున్న దురదృష్టం ఏమిటంటే ఎంఎల్సీ పదవి అందని ద్రాక్ష పండులా తయారైపోయింది. నిజానికి 2019లోనే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట ఎంఎల్ఏ టికెట్ రావాల్సింది. అయితే చివరి నిముషంలో టికెట్ దక్కలేదు. దాంతో ఎంఎల్ఏ టికెట్ ఇవ్వలేకపోయినందుకు ప్రత్యామ్నాయంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఎంఎల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని స్వయంగా జగన్మోహన్ రెడ్డే హామీ ఇచ్చారు.

అయితే తెరవెనుక ఏమి జరుగుతోందో ఏమో తెలీటం లేదుకానీ గడచిన రెండున్నరేళ్ళుగా ఎప్పుడు ఎంఎల్సీ పదవుల భర్తీ అవకాశం వచ్చినా మర్రికి మాత్రం దక్కటం లేదు. ప్రతిసారి మర్రికి ఎంఎల్సీ ఖాయమని ప్రచారం జరగటం చివరకు అందకుండా పోవటం రివాజుగా మారిపోయింది. తాజాగా ప్రకటించిన 11 మంది ఎంఎల్సీల జాబితాలో కూడా మర్రి పేరు మిస్సయిపోయింది. ముందుగా ఎంఎల్ఏ కోటాలో మూడు పేర్లలో ఉంటుందని అనుకున్నారు. ఎక్కడా కనబడలేదు.

ఇపుడు స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన 11 మంది స్ధానాల్లో మర్రికి ఖాయమనే పార్టీలో ప్రచారం జరిగింది. ఎలాగూ 11 మందికి ఇస్తున్నారు కాబట్టి మర్రికి ఖాయమనే అనుకున్నారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన 11 పేర్లలో మర్రి పేరు మళ్ళీ మిస్సయింది. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినా పదవి దక్కటం లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి జగన్ హామీ ఇస్తే దాన్ని నిలుపుకుంటారనే పేరుంది. కానీ విచిత్రంగా మర్రి విషయంలోనే ప్రతిసారి ఎందుకు మిస్సవుతోందో అర్ధం కావటంలేదు.

జరుగుతున్నది చూస్తుంటే జగన్-మర్రి మధ్య ఏదో జరిగినట్లే అనుమానంగా ఉంది. లేకపోతే ఇన్నిసార్లు అవకాశాలు వస్తున్నా మర్రికి ఛాన్సు మిస్సయే అవకాశమే లేదు. స్ధానికసంస్ధల కోటాలో ఎక్కువమందిని ఎకామిడేట్ చేసే అవకాశం వచ్చినా మర్రికి ఛాన్సు ఎందుకు రాలేదన్నదే పెద్ద పజిల్ అయిపోయింది. మొత్తానికి మర్రిని చూస్తున్న వారంతా పాపం మర్రి అని నిట్టూర్పులు విడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.