జనసేన- పోటీకి ముందే చేతులెత్తేశారా ?

తాజా పరిణామాలు చూస్తుంటే విషయం ఇలాగే అనిపిస్తోంది. అనంతపురంలో జరిగిన శ్రమదానం కార్యక్రమం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మట్లాడుతు బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో తమ పార్టీ తరపున అభ్యర్ధిని పోటీ పెట్టడం లేదని ప్రకటించారు. నియోజకవర్గంలో ఏ పార్టీ తరపున ఎంఎల్ఏ చనిపోయినా పోటీపెట్టకుండా ఉండాలనే సంప్రదాయాన్ని అనుసరించి తమ పార్టీ తరపున ఎవరినీ అభ్యర్థిగా పోటీలోకి దింపటం లేదన్నారు.

ఇదే విషయాన్ని తమ మిత్రపక్షమైన బీజేపీకి చెప్పినట్లు పవన్ చెప్పడం గమనార్హం. బద్వేలు ఉప ఎన్నికలో పోటీచేయాలా ? వద్దా ? అన్న విషయాన్ని కమలం నేతలే తేల్చుకోవాలని కూడా చెప్పారు. పవన్ ప్రకటన చూస్తే ఒకరకంగా పోటీకి ముందే చేతులెత్తేసిన నట్లుగానే ఉంది. ఎందుకంటే సంప్రదాయానికి పవన్ ఇంత విలువ ఇస్తున్నదే వాస్తవం అయితే మరి ఇదే సంప్రదాయం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఏమైంది ? అన్నదే అర్థం కావట్లేదు.

ఎందుకంటే పార్లమెంట్ ఉపఎన్నికలో జనసేన తరపున అభ్యర్ధిని పోటీచేయించటానికి పవన్ చివరి నిముషం వరకు ఎంతగా ప్రయత్నించింది అందరికీ తెలిసిందే. అప్పుడు బీజేపీ నేతలు కూడా పోటీ విషయంలో గట్టిగా పట్టుబట్టడంతో చేసేదిలేక పవన్ వెనక్కు తగ్గారు. అప్పుడు కూడా సంప్రదాయం ప్రకారం పోటీ చేయకూడదని పవన్ చెప్పుంటే బాగానే ఉండేది. కానీ అప్పుడు ఆపని చేయకుండా బద్వేలులో మాత్రం సంప్రదాయమని కతలు ఎందుకు చెబుతున్నారు ? అయితే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసింది దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబం కాదు కదా అనే వాదన వినిపిస్తోంది.

సరే, పోటీ నుండి జనసేన తప్పుకుంటుంది బాగానే ఉంది. మరి మిత్రపక్షమైన బీజేపీ తరపున పోటీచేసే అభ్యర్థికి మద్దతు ఇస్తుందా ? ఇవ్వదా ? అన్న విషయాన్ని చెప్పలేదు. సంప్రదాయం ప్రకారం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పవన్ చెప్పిందే నిజమైతే పోటీచేస్తున్న బీజేపీకి మద్దతు ఇవ్వకూడదు. ఒకవేళ మద్దతిస్తే అప్పుడు బీజేపీకి మద్దతిచ్చినా ఒకటే నేరుగా పోటీ చేసినా ఒకటే కదా. ఏరకంగా చూసినా వైసీపీ నేతల తాట తీస్తానన్నారు. తోలుతీసి మోకాళ్ళపై కూర్చోబెడతానన్నారు.

వైసీపీ నేతలకు భయం అంటే నేర్పిస్తానంటూ సినిమా డైలాగులు చాలానే చెప్పి చివరకు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించటమంటే ఎవరు ఎవరిని చూసి భయపడినట్లు ? అన్నదే అర్థం కావటం లేదు. మొత్తానికి తన సత్తా ఏమిటో జనసేనానికి బాగానే అర్ధమైనట్లుంది. అందుకనే ఎందుకొచ్చిన తలనొప్పులంటు సంప్రదాయం పేరు చెప్పి పోటీ నుండి తప్పుకున్నారు. మరి బీజేపీ ఏమి చేస్తుంది ? టీడీపీ ఏమి చేస్తుందనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది.