ది ఎలిఫెంట్ విష్పరర్స్ ప్రత్యేకత ఇదే

మనం ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవడం గురించి సంబరాల్లో మునిగితేలుతున్నాం కానీ గర్వపడే మరో సంగతి కూడా గుర్తు చేసుకోవాలి. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో మన భారతీయులే తీసిన ది ఎలిఫెంట్ విష్పరర్స్ విజేతగా నిలవడం ఇంకో గొప్ప విషయం. ఇప్పటిదాకా భారతదేశానికి సంబంధించి నేరుగా అకాడెమి పురస్కారం అందుకున్న ఫస్ట్ ఇండియన్ ప్రొడక్షన్ ఇదే కావడం విశేషం. నిజానికిది అధికారిక నామినేషన్ల లిస్టులో ఉన్నప్పటికీ అంతగా ప్రాచుర్యం లభించలేదు. దానికి తోడు సినిమా కాకపోవడంతో ప్రచారం దక్కలేదు.

ది ఎలిఫెంట్ విష్పరర్స్ కు దర్శకత్వం వహించింది కార్తికి గొంజాల్వేస్. ఈమెకిది డెబ్యూ కంటెంట్. కేవలం 39 నిమిషాల నిడివితో ఉంటుంది. గత ఏడాది డిసెంబర్ లోనే నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చినా పెద్దగా జనాల దృష్టిలో పడలేదు. అనాథగా మారిన ఓ చిన్నారి ఏనుగుకి ఒక జంటకు మధ్య ఏర్పడే అనుబంధం చుట్టూ కార్తికి ఈ లఘు చిత్రాన్ని తీశారు. లెన్త్ చాలా తక్కువే అయినా దీనికి నలుగురు ఛాయాగ్రాహకులు కరణ్ – క్రిష్ – ఆనంద్ – కార్తికి పని చేయడం విశేషం. ఎడిటర్లు కూడా ఇద్దరు ఉన్నారు. దీన్ని బట్టే క్వాలిటీకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.

దీన్ని రూపొందించేందుకు గాను కార్తికి తీసుకున్న సమయం అయిదు సంవత్సరాలంటే ఆశ్చర్యం కలగక మానదు. ఏనుగులను దగ్గరి నుంచి రీసర్చ్ చేసేందుకు ఏడాదిన్నర ఖర్చు పెట్టారు. ఆస్కార్ కన్నా ముందు ది ఎలిఫెంట్ విష్పరర్స్ కు డిఓసి న్యూ యార్క్, హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్, ఐడిఏ డాక్యుమెంటరీ అవార్డ్స్ లో పురస్కారాలు దక్కాయి. నిర్మాతల్లో ఒకరైన గునీత్ మోంగ ఎన్నో బాలీవుడ్ క్లాసిక్స్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసిన అనుభవం గడించారు. ఇంత గొప్ప టీమ్ ఉంది కాబట్టే సాధారణ ప్రేక్షకులకు తెలియకుండా ఉన్న ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఏకంగా ఆస్కార్ కొట్టేసింది.